హైదరాబాద్‌ను చుట్టుముట్టి.. వైరస్‌ను తుదముట్టించాలి : సీఎం కేసీఆర్‌

 హైదరాబాద్‌ దాని చుట్టుప్రక్కల జిల్లాలు తప్ప కరోనా రాష్ట్రంలో అదుపులోనే ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కావునా హైదరాబాద్‌ను చుట్టుముట్టి వైరస్‌ను తుదముట్టించాలని సీఎం పేర్కొన్నారు. కరోనా నివారణ, లాక్‌డౌన్‌పై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలోనే ఉన్నాయన్నారు.  అధికారులు హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి చికిత్స చేయించడంతో పాటు అతను కలిసిన వారందరినీ క్వారంటైన్‌ చేయాలన్నారు. హైదరాబాద్‌లోని వారు బయటకు పోకుండా బయటివారు హైదరాబాద్‌లోకి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. చురుకైన పోలీసు అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు, ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలన్నారు.