ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే వరకు విశ్రమించనని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడ్డ నేపథ్యంలో.. ఈ సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటానని తెలిపింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మేరీకోమ్.. గత విశ్వక్రీడలు (2016 రియో ఒలింపిక్స్) అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే.
దేశానికి ఒలింపిక్ స్వర్ణం అందించడమే తన లక్ష్యమని ఈ దిగ్గజ బాక్సర్ పునరుద్ఘాటించింది. అందుకోసం తాను తీవ్రంగా శ్రమిస్తానని చెప్పింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో బుధవారం జరిపిన ఫేస్‌బుక్ చాట్‌లో తన మనసులో భావాలను వెల్లడించింది. కష్టపడటం తప్ప విజయానికి మరో సూత్రం లేదని.. తాను చిన్నప్పటి నుంచి ఇదే పాటిస్తున్నానని పేర్కొంది.