సింగరేణి సేవాసమితి ఇచ్చిన ప్రీ-ఆర్మీ రెసిడెన్షియల్ శిక్షణతో ఆర్మీకి ఎంపికై భారతసైన్యంలో చేరనున్న 21 మంది యువకులను హైద్రాబాద్ సింగరేణి భవన్ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జి.ఎం. (సి.డి.ఎన్.) సేవా సమితి ఉపాధ్యక్షులు ఆంటోనిరాజా, ఆర్మీ అధికారి కల్నల్ శ్రీనివాస్ రావు, సింగరేణి వ్యాప్త సేవాసమితి కో-ఆర్డినేటింగ్ అధికారి మహేష్, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.వి.రాజశేఖర్ రావు, వివిధ ఏరియాల పర్సనల్ అధికారులు పాల్గొన్నారు. కంపెనీ వ్యాప్తంగా 3 చోట్ల నిర్వహించిన ప్రి ఆర్మి రెసిడెన్షియల్ శిక్షణ శిబిరంలో 2 నెలల శిక్షణ పొందిన అనంతరం సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్ మెంట్ విభాగం నిర్వహించిన శారీరక ధారుఢ్య పరీక్షలు, మెడికల్ పరీక్షలు, రాత పరీక్షల్లో ఉత్తీర్ణులై ఆర్మీకి ఎంపికైన దాదాపు 35 మంది అభ్యర్ధుల్లో, అందుబాటులో ఉన్న 21 మంది యువతను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఆర్మీలో చేరనున్న యువతను ఉద్దేశించి అతిథిగా పాల్గొన్న కల్నల్ శ్రీనివాస్ రావు భారత రక్షణ కవచమైన ఆర్మీలో చేరుతున్న యువతకు అభినందనలు తెలిపారు. క్రమశిక్షణతో శిక్షణాకాలం పూర్తిచేసుకోవాలనీ, పోస్టింగ్ ఇచ్చిన చోట చక్కగా పనిచేస్తూ సింగరేణికి, తెలంగాణా రాష్ట్రానికి మంచిపేరు తేవాలనీ, ఇతర యువకులు కూడా ఆర్మీలో చేరేందుకు మంచి స్ఫూర్తినివ్వాలని కోరారు.
ఆర్మీకి ఎంపికైన యువతకు ఘనసన్మానం